సమాచారం పొందడం, సమాచారం అందించడం అభివృద్ధికి, పెరుగుదలకు ప్రధాన సూచికలు. సమాచారం సేకరించడం, అవసరానికి అనుగుణంగా వినియోగించడం, సందర్బానికి అనుగుణంగా మలుచుకోవడం నేటి సమాచార విస్ఫోటన యుగంలో ముఖ్య ప్రక్రియ. సమాచారం సేకరించాలంటే అది ఎక్కడో అక్కడ పొందుపరచబడి ఉండాలి. పొందుపరచబడింది అంటే అది ఎక్కడ్నుంచో సేకరించబడింది. అలా సమాచారం సేకరించడం, పొందుపరచడం పరస్పర ప్రభావితాంశాలు. ఈ నేపథ్యంలో మరో మెట్టు సమాచారం రూపొందించడం. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సమాచారం రూపొందించడానికి ప్రముఖ స్థానం ఉంది. వ్యవసాయాభివృద్ధికి రైతాంగానికి కావలసిన సాంకేతిక సమాచారాన్ని పరిశోధనల ద్వారా రూపొందిస్తూ వివిధ కార్యక్రమాల ద్వారా దానిని రైతులకు అందిస్తారు. వ్యవసాయాభివృద్ధి అంటే కేవలం నేల, నీరు, విత్తనాలకు పరిమితం కాదు. వాటిని వినియోగించుకునే వ్యక్తులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అందుచేత రైతు పొలం, పంటతో పాటు కుటుంబం సామాజికంగా, శారీరకంగా, పోషణ, ఆరోగ్య పరంగా అభివృద్ధి చెందడానికి అవసరమైన సమాచారాన్ని కూడా పరిశోధనల ద్వారా రూపొందించి అందిస్తారు. పంటసాగు, ఇంటిబాగు – ఈ రెండు అంశాల మధ్య సమన్వయం, సమతుల్యత నిరంతరం ఉంటుంది.
ప్రింటు లేదా ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా సమాచారం ప్రసారం చేయాలన్న భాష, భావం, భావ వ్యక్తీకరణ చాలా ముఖ్యం. అందుకు నైపుణ్యం చాలా అవసరం. అందుకే రైతు లోకానికి సమాచారం అందించడం నా భాధ్యత అనే సామాజిక స్పృహను వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ప్రతి బోధన, పరిశోధన, విస్తరణ సిబ్బంది స్వతహాగానే ఆకళింపు చేసుకుంటారు. విద్యార్థులను కూడా అందుకు సిద్ధం చేస్తూ తరగతి గదులలోను, క్షేత్రస్థాయిలోను తర్ఫీదునిస్తారు.
పి జె టి యస్ ఎయు వారి చేనుకబుర్లు అందుకు ఒక వేదిక. కాలం, వాతావరణం, పరిస్థితులు, స్థితిగతులు, సమస్యలు మొదలైన విషయాలను పరిగణనలోకి తీసుకుంటూ తగు అంశాలపై విద్యార్థులు సాంకేతిక సమాచారాన్ని సేకరించడం దానిని తెలంగాణ యాసలో కథ, కథానిక, రూపకం, నాటకం, ప్రసంగం మొదలైన రూపాలలో కూర్చుకుని, విస్తరణ స్టూడియోలో రికార్డు చేసి ఆకాశవాణి విభాగానికి అందించి, ప్రతి బుధవారం మద్యాహ్నం 1.30 నుండి 2 గంటల వరకు ప్రసారం చేస్తున్నాము.
ఉత్సాహం ఉరకలు వేసే వయస్సు, తమ వృత్తి గమనాన్ని నిర్ణయించుకునే స్థితి, అంతర్లీనంగా ఉన్న నటనాసక్తి, తరగతి గదిలో నేర్చుకున్న విజ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలనే జిజ్ఞాస మొదలైనవి సహజంగానే ఉండే పి జె టి యస్ ఎయు వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులను ఈ కార్యక్రమం ద్వారా లక్ష్య సమూహానికి చేరువగా తీసుకుని వెళ్ళడం ఒక అనుసంధాన ప్రక్రియ. సాంకేతిక సమాచారంతో విద్యార్థులను రైతు లోకానికి చేర్చడం వలన తమ విద్య యొక్క పరమార్థం అనుభవంలోకి వస్తుంది. తద్వారా అంకిత భావం, ఆత్మవిశ్వాసం కూడా పెంపొందుతాయి.
ఉద్దేశ్యాలు
- తమలోని సృజనాత్మకతను బయటికితీసే అవకాశాన్ని విద్యార్థులకు కల్పించడం.
- సాంకేతిక విజ్ఞానం క్రొత్త క్రొత్త విధానాల ద్వారా ప్రసారం చేసే ప్రయత్నానికి విద్యార్థులను ప్రోత్సహించడం.
- వాస్తవ సంఘటనలను విద్యార్థులకు తెలుపుతూ, దాని పట్ల స్పందించడానికి అవసరమైన సమాచారాన్ని విద్యార్థులకు అందించడం.
- సాంకేతిక సమాచారంతో రైతుకి లాభం చేకూర్చడం.
తేదీ 26-01-2015న గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిచే ఆవిష్కృతం చేయబడిన ఈ కార్యక్రమం నిరవధికంగా ప్రతి బుధవారం ఆకాశవాణి ద్వారా 1.30 నుండి 2.00 గంటల వరకు ప్రసారం అవుతూఉంది. విజ్ఞానం ఎప్పుడు సమయానికి, దినానికి పరిమితం కాకూడదు. అవసరమైనప్పుడు, వినియోగదారులకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశ్యంతో బ్లాగు(blog) రూపొందించబడింది. ఇప్పటి వరకు ప్రసారమైన ప్రతి సంచిక పొందుపరచబడింది. భవిష్యత్తులో ప్రసారం చేయబడే సంచికలు కూడా పొందుపరచబడతాయి. ఏదైనా అంశంపై సమాచారం కావాలన్నా అడిగే అవకాశం ఈబ్లాగులో ఉంది.